12/09/2016

పవన్ - కేసీఆర్ ఒకే వేదికపైకి రానున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో కేసీఆర్ - అదేస్థాయిలో ఫాలోయింగ్ ఉన్న సినీ నటుల్లో పవన్ కల్యాణ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాష్ట్రం తెచ్చిన నేతగా ఒకరు దేశస్థాయిలో తనదైన పేరును సంపాదించుకోగా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వ మద్దతుదారుడిగా - మరోపక్క రాష్ట్ర హక్కును సాధించుకోవడం కోసం ఉద్యమిస్తున్న నేతగా పవన్ పేరు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ప్రత్యక్షంగానో - పరోక్షంగానో వీరిద్ధరూ ఒకరినొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకేవేదికపై కనిపించబోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ - సినీనటుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుసుకోబోతున్నారు. అలా అని వీరి కలయికకు వేదిక కాబోతుంది రాజకీయ అంశం కాదు.. రాజకీయ భేటీ అంతకన్నా కాదు.. ఒక సినిమా కి సంబందించిన ఆడియో ఫంక్షన్. మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు - కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం జాగ్వార్ ఆడియో విడుదల కార్యక్రమానికి వీరిద్దరూ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు. 

ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కుమారస్వామి భేటీ అయ్యారు. అనంతరం జాగ్వార్ ఆడియో విడుదల వేడుకకు రావాల్సిందిగా కుమార స్వామి ఆహ్వానించడం... పవన్ కూడా అంగీకరించడం జరిగిందట. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అయిన కుమార స్వామి.. కేసీఆర్ ను కూడా ఆహ్వానించారని - ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి వీరిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరైతే మాత్రం.. ఆ వేదిక ఎలా ఉండబోతుంది - ఎలా హోరెత్తబోతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కాగా సుమారు 75 కోట్ల రూపాయల భారీ వ్యయంతో  తెరకెక్కిన ఈ సినిమా ఆడియో కార్యక్రమం సెప్టెంబర్ 18న జరగబోతోంది.

No comments:

Post a Comment