16/09/2016

కొమరం పులిలా రావయ్యా.. పవన్

ఆ ఇద్దరూ సినిమాల్లో మంచి పేరున్నవాళ్లే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ పాపులరే. ఇద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేకపోయినా ఒకే కాలంలో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా అందులో ఒకరిపై ఇంకొకరు ఘాటైన విమర్శలే చేయడంతో రాజకీయంగా అలజడి రేగుతోంది. అందులో ఒకరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత - హీరో వపన్ కళ్యాణ్ అయితే... రెండో వ్యక్తి - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - మాజీ హీరోయిన్ రోజా.  పవన్ తన హీరోయిజం చూపించాలే కానీ గోడ మీద పిల్లిలా ఉండకూడదని ఆమె అనడం సంచలనంగా మారింది.

ప్రజాసేవ చేయాలని - రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా పూటకో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని పవన్ కు రోజా  సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహారదీక్షలో పాల్గొన్న ఆమె ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన పవన్ - టీడీపీ - బీజేపీలకు మద్దతిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారని - ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగులు పెట్టి డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. చేతనైతే ఎన్టీఆర్ లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. 

మరోవైపు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె నాడు పవన్ కూడా హోదా వస్తుందని చెప్పారని ఇప్పుడిక రెండున్నరేళ్ల తరువాత ఇంకా వేచి చూసే ధోరణి ఏంటని ప్రశ్నించారు. కాగా పవన్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నా వైసీపీ నుంచి ఎవరూ ఆయనపై ఫైరవ్వలేదు. తాజాగా రోజా వ్యాఖ్యలతో పవన్ పై విమర్శల దాడి మరింత పెరిగినట్లయింది. కాగా... రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా పవన్ కుటుంబంతో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న పవన్ సోదరుడు చిరంజీవితో రోజా పలు సినిమాల్లో నటించారు. పవన్ మరో సోదరుడు నాగబాబు - రోజాలు కలిసి ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నా రాజకీయంగా పవన్ వైఖరిని మాత్రం రోజా తీవ్రంగా తప్పు పట్టారు. మరి రోజా విమర్శలను విమర్శలుగా కాకుండా సూచనలుగా తీసుకుని పవన్ మారుతాడా.. కొమరం పులిలా విజృంభించి రోజా కోరిక తీరుస్తాడా అన్నది చూడాలి.

No comments:

Post a Comment