02/09/2016

ప్రత్యేక సాయం పవన్ ఖాతాలోనేనా?

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా.. లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా అన్నది పక్కనపెడితే కేంద్రం మాత్రం దీనిపై భారీ ఎత్తున కసరత్తు చేయడం వెనుక పవన్ సభ ప్రభావం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ - వైసీపీ - చివరకు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేసినా ఏమాత్రం స్పందించని కేంద్ర ఇప్పుడు కదిలొచ్చిందంటే అందుకు పవనే కారణమని అంటున్నారు. పవన్ ప్రత్యేకహోదాపై ప్రశ్నించిన వెంటనే కేంద్రంలో కదలికొచ్చిందని చెబుతున్నారు. 

 పవన్ ఇటీవల సభ పెట్టడమే కాకుండా ఈ నెల 9వ తేదీ నుంచి మూడెంచెల ఉద్యమానికి సమాయత్తంకావడంతో ఒక్కసారిగా కేంద్రప్రభుత్వం స్పందించింది. సాక్షాత్తు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి మంత్రులతో సమావేశమయ్యారు. హోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్ గా మారడంపై వివరాలు అడిగారు. అసలు రాష్ట్రానికేం చేయాలంటూ లెక్కలు తీశారు. ఇంత వరకు చేసినదానిపై ఆర్ధికశాఖ నుంచి వివరాలు రప్పించారు. అసలే తన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారంటూ ఆవేదనకు గురైన అరుణ్ జైట్లీ కూడా ఆ వ్యవహారంలో సానుకూలంగానే వ్యవహరించారు. ఇంతవరకు ప్రకటనలే తప్ప రాష్ట్రానికిచ్చిందేంలేదంటూ ఆయన లెక్కల్తో సహా నివేదిక సమర్పించారు. మిత్రపక్షం తెలుగుదేశానికి చెందిన సుజనాచౌదరిని కూడా బీజేపీ అంతర్గత అత్యున్నత సమావేశానికి అమిత్ షా ఆహ్వానించారు. ఏం చేస్తే ప్రజల్ని సంతృప్తిపర్చొచ్చంటూ వివరాలడిగారు. రెండ్రోజుల పాటు అమిత్షా సమక్షంలో సమావేశాలు జరిగితే ఆ తర్వాత ఏకంగా ప్రధాని మోడీయే ఈచర్చల్లో పాల్గొన్నారు. హోదా అంటూ ఇస్తే ఇప్పటికే ఆ డిమాండ్ చేస్తున్న ఒడిశా - ఉత్తర ప్రదేశ్ - బీహార్ - తమిళనాడుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదమున్నందున అంతకుమించి ప్రయోజనాలు చేకూర్చే విధంగా నివేదిక రూపొందించాలంటూ మోడీ ఆదేశించినట్లు సమాచారం.

కాగా ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపు రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఈ దశలో పవన్ ఉద్యమాల పేరుతో కేంద్రంపై విజృంభిస్తే తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు - కర్ణాటకల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  కేంద్రానికి వ్యతిరేకంగా ఒకచోట బలమైన ఉద్యమం రూపుదిద్దుకుంటే ఇతర రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఉద్యమాలు రాజుకునేందుకు వీలేర్పడుతుంది. ఇది వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ప్రయోజనాల్ని దెబ్బతీసే ప్రమాదముంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం హడావిడిగా నష్ట నివారణాచర్యలకు ఉప క్రమించింది.  దీంతో కేంద్రం ఏపీకి ఏమిచ్చినా కూడా ఆ క్రెడిట్ పవన్ ఖాతాలోనే పడుతుందని అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment