08/09/2016

బాబుకు ఈసారి ‘పవర్’ షాక్ తప్పదా?

ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఏపీని ఊపేస్తుంది. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్యాకేజీ ప్రకటన సీమాంధ్రుల రక్త సలసలా కాగేలా చేసిందని చెప్పాలి. గడిచిన కొద్ది రోజులుగా ఏపీకి అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఊరించటమే కాదు.. హోదా కారణంగా ఏపీకి ఎంత లాభం కలుగుతుందో అంతే లాభం కలిగేలా ఏపీకి భారీ ప్యాకేజీ లభించేలా మోడీ సర్కారు కసరత్తు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమే తప్ప నిజం లేదన్న విషయం నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత తేలిపోయింది.

హోదాపై జైట్లీ ప్రకటనపై సీమాంధ్రులు ఆవేశంతో రగిలిపోతున్న వేళ.. మరో రోజు వ్యవధిలో జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. కాకినాడ సభకు దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనా వ్యక్తమవుతోంది. ఈ సభలో పవన్ ఏం మాట్లాడాతరన్నది సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న తిరుపతి సభలో హోదా అంశంపై చివర్లో పవర్ ఫుల్ డైలాగు చెప్పి ‘ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’’ అన్న చందంగా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హోదా కత అన్నది ఇక లేదన్న విషయాన్ని విస్పష్టంగా చెప్పేసిన అరుణ్ జైట్లీ.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ కాసిన్ని ముష్టి పడేసిన నేపథ్యంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీపై చంద్రబాబు ఆచితూచి స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రులకు చేసిందేమీ లేని జైట్లీపై బాబు ఎందుకు విరుచుకుపడలేదన్నప్రశ్న ప్రతి ఒక్కరి నోటవస్తున్న మాట. అందరి నోట వచ్చే మాటకు.. పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చే మాటకు ఉండే ప్రభావం వేరుగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

తిరుపతి సభలో బాబు తీరుపై ఆచితూచి స్పందించిన పవన్ కాకినాడ సభలో ఏం చేస్తారన్నది ఒక ఆసక్తికర అంశంగా మారింది. హోదా అంశాన్ని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో మోడీ అండ్ కోపై పంచ్ లు భారీగా ఉంటాయని.. పనిలో పనిగా చంద్రబాబు మీద కూడా ఈసారి విసుర్తు తప్పవన్న మాట వినిపిస్తోంది. బాబుపై పవన్ పంచ్ లు పవర్ ఫుల్ గా ఉంటాయా? లేదా? అన్నది మరో రోజులో తేలిపోతుందని చెప్పక తప్పదు.

No comments:

Post a Comment