10/09/2016

పవన్ నాలుక కోస్తారా!టీడీపీ ఎంపీకి శివాజీ ప్రశ్న

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు - నాయకుల మధ్య వార్ తీవ్రమవుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. హోదా కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సింది పోయి ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి మైలేజ్ కోసం వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు - సినీ నటుడు శివాజీ కొద్ది రోజులుగా హోదా కోసం తన స్వరం గట్టిగా వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శివాజీ కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి - టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై దారుణమైన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీల నుంచి శివాజీకి కౌంటర్లు వచ్చాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ సుజనా చౌదరిని ప్రశ్నించడానికి శివాజీ ఎవరు ?  మరోసారి శివాజీ సుజనా గురించి మాట్లాడితే శివాజీ నాలుక కోస్తానని ఫైర్ అయ్యారు.

 అయితే ఈ వ్యాఖ్యలపై శివాజీ శనివారం తనదైన స్టైల్లో మళ్లీ స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం విజయవాడలో నిర్వహిస్తోన్న బంద్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను గళమొత్తితే ఓ ఎంపీ తన నాలుక కోస్తానని అన్నారని..మరి పవన్ కళ్యాణ్ కూడా హోదా కోసం గళమెత్తితే ఆయన నాలుక కూడా కోస్తా అని ఎందుకు అనలేదని శివాజీ పరోక్షంగా ఎంపీ శివప్రసాద్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. 

 పవన్ ను ఏమైనా అంటే పవన్ అభిమానులు తిరగబడతారని భయపడుతున్నారా ? ఎంపీలు మనిషిని బట్టి ఒక్కో మాట మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన శక్తిని కరెక్టుగా వాడుకుంటే ఆయనకు కేవలం వారం రోజుల్లో ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని..కేవలం ఏపీకి న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని కుండబద్దలు కొట్టారు.

 చంద్రబాబు సర్కార్ పైనా శివాజీ సెటైర్లు వేశారు. అప్పుడప్పుడు కేంద్రం వేస్తోన్న భిక్షాన్ని తీసుకోవద్దని ఆయన ఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సైతం కేంద్రం ప్రజలను మాయ చేస్తోందని...పోలవరం ప్రాజెక్టు అంత సులువుగా పూర్తవ్వదని కూడా శివాజీ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు....పవన్ జనసేన పెట్టుకున్నారు...శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు గుప్పించమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని... ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని...ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆపే ప్రశక్తేలేదని శివాజీ తేల్చిచెప్పారు. ఏదేమైనా ప్రత్యేక హోదా కోసం శివాజీ ఉడుం పట్టినట్టే కనిపిస్తోంది.

No comments:

Post a Comment