11/09/2016

పవన్ కూడా ప్రజల్లో ఒక్కడే వెంకయ్య

రాజకీయాలు మహా కర్కసంగా ఉంటాయి. వాడి పారేయటం.. అవసరం తీరా కాడి పారేయటం ఎలా అన్నది రాజకీయాల్ని చూసి మాత్రమే తెలుసుకోవాలి. తాజాగా ఏపీ రాజకీయాల్ని చూడండి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కోరుకున్న బీజేపీ.. టీడీపీలు.. ఈ రోజు ఆయన వాదనకు విలువనిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తమలో ఒకడైన పవన్.. తమను ఎప్పుడైతే విమర్శించాడో.. వ్యతిరేకించాడో వెంకయ్య మొదలు అందరికి శత్రువయ్యారు. ఇంతకీ పవన్ చేసిన తప్పేంటి అంటే.. ప్రజల పక్షాన మాట్లాడటం. మోడీకి కొమ్ము కాయకపోవటం.

హోదా సాధ్యమా? సాధ్యం కాదా? అన్న విషయాన్ని గడిచిన కొన్నిరోజులుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ.. ఆ వాదనలోకే వెళ్లే ముందు.. అలా అన్న వారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న సంధిస్తే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తుందనే ఉద్యమం చేశారా? పక్కా అనే తెలంగాణ ఉద్యమ గోదాలోకి కేసీఆర్ దిగారా? అన్న ప్రశ్న వేసుకుంటే హోదా సాధ్యమేనా? అన్న ప్రశ్నకు సమాదానం దొరికిపోతుంది.

హోదా తమకు కుదరదని తేల్చుకున్న బీజేపీ అధినాయకత్వం.. ఎన్నికలు ముగిసి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల మూడు నెలలకు ఎందుకు తేల్చి చెప్పినట్లు? ఎవరైతే హామీ ఇచ్చారో వారిని తీవ్రస్థాయిలో విమర్శించిన పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. అలా చేసిన వారిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఉందన్న ఆయన.. తనపై కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

తాను ప్రజలకు జవాబుదారినని.. వారికే సమాదానం చెబుతానంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వారు అప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన వెంకయ్య రెండు విషయాల్ని మర్చిపోయారని చెప్పాలి. ప్రత్యేకహోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా.. అప్పట్లో తమతో భుజం కలిపారని.. తమకు మిత్రులుగా ఉన్నారన్నది మర్చిపోకూడదు. ఇక.. ప్రజలకే తాను సమాధానం చెబుతానని చెబుతున్న వెంకయ్య.. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రజల్లో ఒక్కడన్న విషయాన్ని ఆయన మర్చిపోవటం ఏమిటో..?

No comments:

Post a Comment