16/11/2016

ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే

సినిమావాళ్లు చాలా కమర్షియల్ గా ఉంటారని చెబుతుంటారు. పని ఉందా పూసుకుంటారని.. పని పూర్తి అయ్యాక ఎవరో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తారని.. అది వారి తప్పు కాదని.. వారున్న ఇండస్ట్రీ అలాంటిదని చెబుతుంటారు. ఇక్కడ తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా వ్యవహరిస్తారని.. పైకి ఎంత పూసుకున్నా.. లెక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా మొండిగా ఉంటారని ఏ మాత్రం తగ్గరన్నట్లు చెబుతుంటారు. అయితే.. ఇలాంటి మాటలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

మిగిలిన హీరోలకు చాలా భిన్నమని కొందరు.. మంచితనానికి నిలువెత్తు రూపంగా మరికొందరు వర్ణిస్తే.. ఎప్పుడేం చేస్తాడో తెలీదని.. టెంపర్ మెంట్ చాలా ఎక్కువని.. మెంటలోడని మరికొందరు ఆయనపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరింత మాట అంటున్నారు కదా.. దానికేమైనా ఆధారం ఉందా? అంటే.. మళ్లీ మాట్లాడని పరిస్థితి.

ఇదంతా ఒక కోణమైతే.. సాయం ఎవరికి వచ్చినా సరే.. సహాయం చేసేందుకు పెద్ద మనసుతో పవన్ ముందుంటారని ఆయన్ను అభిమానించని వారుసైతం ఒప్పుకునే మాట. రాజకీయంగా.. సినిమాల పరంగా ఆయన్ను వ్యతిరేకించే వారు మాత్రం వ్యక్తిగతంగా పవన్ ను విమర్శించేందుకు ఇష్టపడరు. ఆయన చేసే గుప్త దానాల గురించి కొందరు అనుకోని రీతిలో ఓపెన్ అయిపోవటం.. పవన్ లో ఇలాంటి మనిషి దాగి ఉన్నాడా? అనిపించక మానదు. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే గుణం పవన్ లో చిన్నతనం నుంచి ఉందని.. ఆ మాటకు వస్తే.. సినిమాల్లోకి రాక ముందే ఆయనలో ఆ లక్షణం ఉందని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓనమాలు నేర్పించే స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు హీరోల గురించి చెప్పుకొచ్చారు. దాదాపు 95 మంది హీరోల్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన.. పవన్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన దగ్గర యాక్టింగ్ లో శిక్షణ పొందిన పవన్.. తర్వాత కూడా టచ్ లో ఉండేవాడని.. చాలా స్నేహంగా ఉండేవాడని.. హైదరాబాద్ రావాలని కోరేవాడని చెప్పారు.

‘‘ఓ రోజు ముంబయి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ రమ్మన్నాడు. చెల్లెలి పెళ్లి ఉందని కుదరదని చెప్పా. అంతే.. నా ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి కలిశాడు. ఓ చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లి చూస్తే.. అందులో రూ.50వేలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చి మరో రూ.50వేలు ఇచ్చాడు. అడగకుండానే ఇంత సాయం చేశాడు. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా.. అప్పట్లోనే అంత పెద్ద సాయం చేశాడు. సేవాగుణం పవన్ సహజ లక్షణం’’ అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మనుషులు చాలా కమర్షియల్ గా ఉంటారని చెప్పే ఉదంతాలకు పవన్ కల్యాణ్ మినహాయింపుగా చెప్పక తప్పదు.

No comments:

Post a Comment