10/08/2016

మగధీర స్టయిల్లో శిరీష్ సినిమా

ఓ 20-30 ఏళ్ల వెనకటి నేపథ్యంతో సినిమా తీయడమంటేనే కష్టం. అప్పటి పరిస్థితుల్ని తెరమీద చూపించడం అంత సులువైన విషయం కాదు. అలాంటిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంతో సినిమా అంటే ఇక ఎంత కష్టముంటుందో అంచనా వేయొచ్చు. ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళి.. క్రిష్.. గుణశేఖర్ లాంటి అనుభవమున్న దర్శకులు మాత్రమే ఇలాంటి సినిమాల్ని డీల్ చేయగలరు. ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువుండాలి. శ్రమ కూడా ఎక్కువే పడాలి. ఐతే మల్లిడి వేణు అనే ఓ కొత్త దర్శకుడు.. అల్లు శిరీష్ లాంటి చిన్న హీరోను పెట్టుకుని పెద్ద సాహసమే చేస్తున్నాడు. అతను దాదాపు 800 ఏళ్ల కిందటి నేపథ్యంతో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా గురించి శిరీష్ చెబుతూ.. గత జన్మలో ఒక్కటి కాలేకపోయిన ఇద్దరు ప్రేమికులు.. మళ్లీ జన్మించి తమ ప్రేమను సఫలం చేసుకునే కథ ఇదని చెప్పాడు. ఈ మాట వింటుంటే ఇది ‘మగధీర’ను గుర్తుకు తెస్తోంది. కాకపోతే ‘మగధీర’ తరహాలో రాజులు.. రాజ్యాలు అని కాకుండా మామూలు నేపథ్యంతో సినిమా తీస్తారేమో. ఐతే రాజులు.. రాజ్యాలంటే ఒక లెక్కుంటుంది. భారీతనంతో మాయ చేయవచ్చు. అలా కాకుండా సామాన్యుల ప్రేమకథను చూపించాలంటే మాత్రం అంత సులువు కాదు. కంటెంట్ చాలా బలంగా ఉండాలి. ఫ్లాష్ బ్యాక్ అయినా.. ప్రెజెంట్ స్టోరీ అయినా వినోదాత్మకంగా సాగుతుందని చెబుతుండటం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి డెబ్యూ డైరెక్టర్ ఈ సబ్జెక్టును ఎలా డీల్ చేస్తాడో చూడాలి. 

No comments:

Post a Comment