15/08/2016

ఫస్ట్ లుక్: సీరియస్ 'ధృవ' భలే ఉన్నాడు

ఇప్పటికే తన ప్రీ-లుక్ తో అదరగొట్టేసిన రామ్ చరణ్.. ఇప్పుడు స్వాతాంత్ర్యదినోత్సవ సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో మెగా అభిమానులకు ఆనందం పంచుతున్నాడు. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమా మొదటి చూపులను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. 

చెప్పేది ఒక పోలీస్ ఆఫీసర్ కథ కాబట్టి.. చాలా ఇంటెన్స్ గా ఆ పాత్రలను చూపించాలని ఫిక్సయినట్లున్నారు. అందుకే చరణ్ నడిచొస్తున్న స్టిల్స్ చాలా యాక్షన్ ఫీల్ తో అదిరిపోయాయ్. క్లోజప్ పోస్టర్ అయినా.. వాకింగ్ స్టిల్ అయినా.. డిఫరెంట్ ఫేషియల్ లుక్.. కొత్తగా ఉన్న ఆ మీసం.. అలాగే డిఫరెంట్ నడక.. అదరగొట్టశాయి. ఈ పోస్టర్లతో మెగా ఫ్యాన్లకు నిజంగానే పండగే. సీరియస్ లుక్కులో రామ్ చరణ్ భలేగా ఉన్నాడు. అయితే టైటిల్ డిజైన్ వెనుక '8' అనే అక్షరం ఎందుకు పెట్టారు? దానికి ధృవకు సంబంధం ఏంటి? అక్టోబర్ 8న సినిమా వస్తోందా? లేకపోతే ఇంకేమైనా ట్విస్టు ఉందా? మొదలగు విషయాలు తెలియాల్సి ఉంది. 

12/08/2016

ప్రీ-లుక్ టాక్: చరణ్ చంపేశాడంతే

కేవలం బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ లో 'ప్రీ లుక్' కూడా ఒక రేంజులో ఉంటుంది ఎవ్వరూ ఊహించరు. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు. ఈ స్వాతంత్ర్యదినోత్సవం నాడు ''ధృవ' సినిమా ఫస్ట్ లుక్ విడుదలవుతోందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి ఒక ప్రీ-లుక్ పోస్టర్ విడుదల చేశాడు చరణ్. పదండి ఎలా ఉందో చూద్దాం. 

'నా శత్రువే నా బలం' అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే మై ఎనిమీ ఈజ్ మై స్ర్టెంగ్త్ అంటూ ఇప్పుడు ఈ పోస్టర్ ముందుకొచ్చింది. రామ్ చరణ్ అలా బ్యాక్ నుండి కనిపిస్తున్నా కూడా.. ఆ ఫోజు చూస్తుంటే ఏదో హాలీవుడ్ పోస్టర్ చూస్తున్నట్లు ఉంది. సురేందర్ రెడ్డి క్రియేటివిటీ అంతా పోస్టర్లో కూడా బాగానే జొప్పించాడనే ఇట్టే చొప్పేయవచ్చు. ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ అనే టాపిక్ మీద జరిగే ఈ సినిమా.. తమిళంలో వచ్చిన థని ఒరువన్ సినిమాకు రీమేక్. అరవింద్ స్వామీ ఈ సినిమాలో విలన్ గా చేయడం విశేషం. 

ఇకపోతే హిప్ హాప్ తమిళ ను తొలిసారి తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాతో తొలి రీమేక్ కూడా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి ఈ ప్రీ-లుక్ తోనే ఇలా చంపేశాడు.. మరి ఫస్ట్ లుక్ ఎలా ఉండోబోతుందో చూద్దాం. 

11/08/2016

మెగా ఫ్యాన్స్ మురిసిపోయే రోజు అదే..

కొన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాదే తన 150వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది కానీ.. ఎట్టకేలకు గత నెలలోనే అది కూడా మొదలైపోయింది. పని మొదలయ్యాక విరామం లేకుండా షెడ్యూళ్లు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం దాకా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన తొలి విశేషాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు నాడు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ కూడా చేస్తున్నారు. చిరు ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఒక టీమే పని చేస్తోంది. పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను ఈ టీంను లీడ్ చేస్తున్నాడు. తన రీఎంట్రీ మూవీ కోసం చిరు తన లుక్ విషయంలో ఎంత కష్టపడ్డాడో తెలిసిందే. తొలి రోజు షూటింగ్ లో ఆయన లుక్ చూసి అభిమానులు ఉత్సాహం పట్టలేకపోయారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ వాళ్లలో ఇంకెంత ఉత్సాహం నింపుతుందో చూడాలి. ఫస్ట్ లుక్ పరిచయం చేస్తూ సినిమా టైటిల్ కూడా ప్రకటించే అవకాశముంది. కత్తిలాంటోడు అని.. నెపోలియన్ అని ఈ సినిమాకు రకరకాల టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ఏది ఫైనలైజ్ అవుతుందో చూడాలి.

10/08/2016

మగధీర స్టయిల్లో శిరీష్ సినిమా

ఓ 20-30 ఏళ్ల వెనకటి నేపథ్యంతో సినిమా తీయడమంటేనే కష్టం. అప్పటి పరిస్థితుల్ని తెరమీద చూపించడం అంత సులువైన విషయం కాదు. అలాంటిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంతో సినిమా అంటే ఇక ఎంత కష్టముంటుందో అంచనా వేయొచ్చు. ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళి.. క్రిష్.. గుణశేఖర్ లాంటి అనుభవమున్న దర్శకులు మాత్రమే ఇలాంటి సినిమాల్ని డీల్ చేయగలరు. ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువుండాలి. శ్రమ కూడా ఎక్కువే పడాలి. ఐతే మల్లిడి వేణు అనే ఓ కొత్త దర్శకుడు.. అల్లు శిరీష్ లాంటి చిన్న హీరోను పెట్టుకుని పెద్ద సాహసమే చేస్తున్నాడు. అతను దాదాపు 800 ఏళ్ల కిందటి నేపథ్యంతో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా గురించి శిరీష్ చెబుతూ.. గత జన్మలో ఒక్కటి కాలేకపోయిన ఇద్దరు ప్రేమికులు.. మళ్లీ జన్మించి తమ ప్రేమను సఫలం చేసుకునే కథ ఇదని చెప్పాడు. ఈ మాట వింటుంటే ఇది ‘మగధీర’ను గుర్తుకు తెస్తోంది. కాకపోతే ‘మగధీర’ తరహాలో రాజులు.. రాజ్యాలు అని కాకుండా మామూలు నేపథ్యంతో సినిమా తీస్తారేమో. ఐతే రాజులు.. రాజ్యాలంటే ఒక లెక్కుంటుంది. భారీతనంతో మాయ చేయవచ్చు. అలా కాకుండా సామాన్యుల ప్రేమకథను చూపించాలంటే మాత్రం అంత సులువు కాదు. కంటెంట్ చాలా బలంగా ఉండాలి. ఫ్లాష్ బ్యాక్ అయినా.. ప్రెజెంట్ స్టోరీ అయినా వినోదాత్మకంగా సాగుతుందని చెబుతుండటం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి డెబ్యూ డైరెక్టర్ ఈ సబ్జెక్టును ఎలా డీల్ చేస్తాడో చూడాలి. 

06/08/2016

పవన్ ఈరాత్రే మొదలెట్టాడు

పవన్ కళ్యాణ్ చిత్రం ఎట్టకేలకి షురూ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ఇంట్లో దర్శకుడు డాలీ షూటింగ్ని మొదలుపెట్టాడు. తొలి రోజే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. రెండు మూడు రోజుల్లో శ్రుతిహాసన్ కూడా యూనిట్ తో జాయిన్ అవుతుందట. పక్కాగా నాలుగు నెలల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్  నిర్ణయించుకొన్నట్టు తెలుస్తుంది. 

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం డాలీ ప్రత్యేకంగా స్క్రిప్టు వర్క్ చేసుకొన్నాడు. అది పవన్ కళ్యాణ్కి బాగా నచ్చిందట. మొదట ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకుడు. కానీ ఆయన కొన్ని కారణాలవల్ల పక్కకు తప్పుకొన్నాడు. దీంతో ప్రాజెక్టు డాలీ చేతిలోకి వచ్చింది. అప్పటికే స్క్రిప్టు పక్కాగా పూర్తయినప్పటికీ డాలీ మాత్రం తనదైన శైలిలో మళ్లీ స్క్రిప్టుపై రీ వర్క్ చేశాడు. ఆ విషయంలో పవన్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. 

05/08/2016

తొలిసారి సెట్ కు వచ్చిన రామ్ చరణ్

ప్రస్తుతం ధృవ సినిమా షూటింగులో బాగా బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు సడన్ గా కొత్త ట్విస్టిచ్చాడు. ఒక ప్రక్కన తన సినిమా షూటింగులో పాల్గొంటూనే.. మనోడు తన తొలి ప్రొడక్షన్ వెంచర్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అదిగో ఈరోజు సరదాగా ఒకసారి అసలు డ్యాడ్ సినిమా షూటింగ్ స్పాటులో ఏం జరుగుతుందో చూడ్డానికి నిర్మాత గారు సెట్టుకొచ్చారు. 

వివి వినాయక్ డైరక్షన్లో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కీలక మూడో షెడ్యూల్ ను ఈరోజు నుండే మొదలు పెట్టారు. ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. అలాగే చిత్ర ఆర్ట్ డైరక్టర్ తోట తరణి గత కొన్ని రోజులుగా కష్టపడి రూపొందించిన ఒక సెట్లో ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. అసలు ఈ యవ్వారం అంతా ఎలా జరుగుతుందో ఒక మారు చూడ్డానికి చరణ్ ఈరోజు లొకేషన్ కు విచ్చేశాడని తెలుస్తోంది. అయితే కేవలం పక్కనుండి షూటింగ్ చూడటమే తప్పించి.. ఇదేంటి అదేంటి అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అక్కడ నుండి లంచ్ చేసి బయలుదేరాడట కుర్రాడు. 

శరవేగంగా 150వ చిత్రాన్ని రూపొందిస్తున్న తీరును చూస్తుంటే.. మనోళ్ళు సంక్రాంతి 2017 డేటును అస్సలు మిస్సయేలా లేరే. 

02/08/2016

చిరంజీవి పిలిచి 20 వేలిచ్చాడు

యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత గాయకుడిగా మారి.. ఆపై సంగీత దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు రఘు కుంచె. దాదాపు దశాబ్దం పాటు బుల్లి తెర మీద టాప్ యాంకర్లలో ఒకడిగా వెలుగొంది.. నంది అవార్డు కూడా అందుకున్న రఘు.. ఉన్నట్లుండి గాయకుడి అవతారమెత్తి  ‘బాచి’ సినిమాలో లచ్చిమి లచ్చిమి అనే పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. రఘు పాట మాత్రం సూపర్ పాపులరైంది. ఆ ఊపులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే పాట పాడే ఛాన్స్ దక్కించుకున్నాడు రఘు. ‘మృగరాజు’ సినిమాలో హంగామా హంగామా అంటూ అతను పాడిన పాట కూడా సూపర్ హిట్. ఐతే ఆ పాట తాను పాడుతానని ఎంత మాత్రం అనుకోలేదని.. తన పాటను చిరంజీవి వింటే చాలు అనుకుంటే ఆయన ఏకంగా పాట పాడే అవకాశం ఇచ్చాడని నాటి అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రఘు.

‘‘బుల్లితెర మీద అప్పట్లో నేనొక్కడినే పాపులర్ మేల్ యాంకర్. అందుకే అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్లు. అలాగే చిరంజీవి గారితో కూడా పరిచయమైంది. బాచిలో పాట పాడాక.. అది మెగాస్టార్ వింటే బాగుంటుందని ఒకసారి ఆయన్ని కలిసి ‘బాచి’ ఆడియో సీడీ ఇచ్చాను. అరగంట తర్వాత ఆయనే ఫోన్ చేసి పాట చాలా బాగుందన్నారు. కొన్ని రోజుల తర్వాత ‘మృగరాజు’ షూటింగ్ జరుగుతున్న టైంలో చిరంజీవి గారే మణిశర్మ గారికి నా గురించి చెప్పి అందులో ఓ పాట నాతో పాడించమన్నారు. మణిగారు ఆడిషన్ చేసి హంగామా హంగామా అనే పాట పాడించారు. ఏదో నా గొంతు చిరంజీవి గారికి వినిపిద్దామని ఆయన్ని కలిస్తే ఏకంగా ఆయనకు పాట పాడే ఛాన్సిచ్చారు. ఆ షాక్ నుంచే తేరుకునే లోపే తన మేనేజర్ని పిలిచి రూ.20 వేలు పారితోషకంగా ఇప్పించారు. అప్పట్లో సాధారణ గాయకులకు రెండు వేలో మూడు వేలో ఇస్తే ఎక్కువ. అలాంటిది నాకు అంత మొత్తం ఇచ్చేసరికి చాలా ఆశ్చర్యమేసింది. ఆ పాట తాలూకు అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని రఘు చెప్పాడు.